అన్యాయాన్ని శిక్షించడానికి మించిన న్యాయం ఈ పుణ్యభూమిలో మరొకటి లేదు... దుష్టశిక్షణ, శిష్ట రక్షణకై ధర్మం దారి తప్పినా ఈ కర్మభూమిలో అది తప్పు కాదు...
అమృత భాండాన్ని కొట్టి అన్నను చంపొచ్చు అని విభీషణుడు ఇంటి గుట్టు బయటబెట్టినా ఈ లోకం అతడిని తప్పు పట్టలేదు. చెట్టు చాటున దాక్కుని వాలిని మట్టు బెట్టేటప్పడు అపకీర్తిని మోయాల్సి వస్తుందేమోనన్న భయాన్ని రాముడు కూడా లక్ష్యపెట్ట లేదు...
విష్ణువంతటివాడు మాయజేసి భస్మాసురుడిని మట్టుబెట్టినా ఈ లోకం అది ధర్మవిరుద్ధం అని నింద వేయ లేదు ...దుర్మార్గాన్ని దునుమాడే బాటలో కంసుడు తనకు మేనమామ అనే భావనను కృష్ణుడు తన మస్థిష్కం లోనికి కాసింత కూడా రానివ్వలేదు...జలంధరుడిని సంహరించే సమయాన కొడుకు అనే పాశానికి శివుడు కూడా ఏమాత్రం చోటివ్వలేదు...
మనం చేసే పనిలో పదిమంది హితమూ దాగివుంటే ఆ పోరాటం ధర్మ విరుద్ధమైనది అయినా పదుగురి ప్రశంసలను అందుకుంటుంది., అందుకు విరుద్ధంగా పదుగురి మధ్య తన కళ్ళ ముందరే ఒక స్త్రీపై దుష్కర్మ జరుగుతూ వుంటే భీష్ముడు అంతటి మహావీరుడు మౌనసాక్షిగా ఉండిపోవడం అది నేరపూరిత మౌనమనే కోవకు చెందుతుంది...
బలవంతుల మనసుల్లో ఏర్పడే కొన్ని కాంక్షలు వాళ్ళ పాలనలో బ్రతికే సమాన్యుల జీవితాల్లో అంతులేని ఆశాంతిని, అలజడిని రగిలిస్తూవుంటాయి...నేడు అరణ్యాలలో మృగాల నుండి లేని ముప్పు జనారణ్యాలలో మానవ మృగాలనుండి ఎదురవుతోంది...
మానసిక కాలుష్యం మానవజాతిని తనకు తానే ఒక సమస్యగా మార్చేసింది... మనిషి తనలోని అహంకారాన్ని వదిలించుకోవడానికి సంపాదించుకున్న జ్ఞానం కూడా తిరిగి ఆ మనిషికి అహంకారాన్నే కానుకగా ఇస్తోంది... పౌరానిక కాలం నుండి నేటి వరకూ కొనసాగుతూ వస్తున్న ఈ అకృత్యాలను ఆపగలిగే నాదుడి రాక కోసం నిరీక్షిస్తూ ముందుకుసాగిపోదాం...
మనిషి ప్రతి దశలోనూ ఆస్వాధించడానికి
ఒకే తండ్రి పిల్లలకు తలా ఒక దారి చూపిస్తాయి వాళ్ళ తలరాతలు... ఒకే లగ్నంలో జన్మనెత్తిన లక్షల మందిలో ఏ ఒకరిద్దరికో వైభవాన్ని అందిస్తాయి...
ఇరువురూ కశ్యపు ప్రజాపతి సంతానమే అయినా దేవతలను, రాక్షసులను వేరే వేరే దారుల్లో నడిపించాయి వాళ్ళ తలరాతలు...
మాయ పాచికల చేతిలో మహా వీరులైన పాండవులను సైతం మట్టి కరిపించాయి... కిరీట ధారణ ముహూర్తానికే రామ చంద్రుడిని కారడవుల బాట పట్టించాయి... వైభోగాలలో మునిగి తేలాల్సిన యువరాజు సిద్దార్దున్ని సన్యాసిగా మార్చి అతడి చేతికి భిక్షా పాత్ర నందించాయి...
జీవితం అనే ఆటలో అదృష్ట దురదృష్టాలు, గెలుపు ఓటములు అనేవి మనిషి చేతిలో వుండవు...అందని దాన్ని గురించి ఆరాట పడనివాడు, దక్కనిదాన్ని గురించి విచారించనివాడు వివేకవంతుడు అన్నాడు విధురుడు...
మెట్టు మెట్టుకు అనిశ్చితి, ఆందోళనలతో సాగే జీవితం అనే ఈ వైకుంఠపాళి ఆటలో ఆరగించే పాములూ ఉంటాయి., అందలమెక్కించే నిచ్చెనలూ వుంటాయి., ఇందులో మనకు ఏది ప్రాప్తం అనేది మన చేతుల్లో వుండదు...కర్మను ఆచరించడానికే అధికారముంది గాని ఫలాన్ని ఆశిస్తూ ఆరాటపడే అధికారం జీవికి లేదన్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు...
బ్రతుకు విలువ తెలియనివాడు తలరాతలను తిట్టుకుంటూ కాలాన్ని గడుపుతూ వుంటాడు, బ్రతుకును ఆస్వాదించడం తెలిసినవాడు ఆ బ్రతుకులోని ప్రతి క్షణంలోనూ జీవిస్తూ కాలంతో పాటుగా కలిసి నడుస్తూ వుంటాడు...
కష్టము, దుఃఖము లేని జీవితం ఆ పరమాత్ముడు ప్రకృతిలో ఏ జీవికీ ఇవ్వలేదు...తన కర్మల ఫలితంగా సుఖ దుఃఖాలను పొందుతున్న మనిషి లభించిన సుఖాన్ని తన ఘనతగా చెప్పుకుంటూ దుఃఖానికి మాత్రం ఆ దేవుడు రాసిన తలరాతలే కారణమంటూ తిట్టుకుంటూ వుంటాడు...
భగవంతుడిని నమ్మి నడవమని పెద్దలు వేసిచ్చిన పూలబాట ఒకటి మనకు వున్నంతకాలం ఎదురయ్యే ఎటువంటి ప్రతికూలతలకైనా మనం చలించి పోవాల్సిన పని లేదు...
సంప్రదించండి సనాతన సమాజం
మీ అభిప్రాయాలు మరియు ప్రశ్నలు మాకు పంపండి. ధన్యవాదాలు!
సంప్రదించండి సనాతన సమాజం
మీ అభిప్రాయాలు మరియు ప్రశ్నలు మాకు పంపండి. ధన్యవాదాలు!