Your blog post
Blog post description.
8/28/20251 min read


వాలిని, రావణుడిని తోడ బుట్టిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు... సాగర మథనంలో దేవగణాలు, తమ పినతల్లి సంతానమైన రాక్షసులకు ఇవ్వాల్సిన సగభాగం అమృతాన్నీ కాజేసి అన్నదమ్ములను వెన్నుపోటు పొడిచారు...
వాలిని, రావణుడిని కడదేర్చేందుకు వాళ్ల తోడబుట్టిన సుగ్రీవ, వీభీషనులే వ్యూహ రచన చేశారు...
అండ వుందని నమ్మిన దుర్యోధనుడిని అత్యవసర సమయాన అస్త్ర సన్యాసం చేసి ఒక రకంగా భీష్మ, ద్రోణాచార్యులు కూడా దొంగదేబ్బే తీసారు...
గురుపత్ని తల్లితో సమానమని తెలిసినా తారా దేవితో ప్రేమాయణం సాగించి చంద్రుడు కూడా గురువును వెన్నుపోటు పొడిచాడు...
ధర్మాలు ఎన్ని తెలిసినా మనిషి లోని సర్వ అంగాలు అధర్మంవైపే అడుగులు వేస్తున్నాయి...
విష సర్పాలలో కూడా విశ్వాత్మను దర్శించ గలిగే ఈ తపో భూమిలో నేటికీ నాటి విష పూరితమైన గాలులే వీస్తున్నాయి... ఎక్కడో రాజ్యాల మధ్యలో రగలాల్సిన కుట్రలు, కుతంత్రాలు నేటికీ ప్రతి ఇంటా రగులుతూనే వున్నాయి...ఇంటింటా ఒక విభీషణుడు నేటికీ కుటుంబానికొక కంటకంగా మారుతూనే వున్నాడు...
మనిషి మానసిక క్షేత్రంలో ఆ పరమాత్ముడునాటిన పచ్చని భావాల మధ్యలో ఈర్ష్య ద్వేషాలు, పగ ప్రతీకారాలు, ఎత్తుగడలు వెన్నుపోట్లు అనే కలుపు మొక్కల్ని మనం పెంచుకుంటూ పోతున్నాం... జీవించడం కోసం సంపాదించడం అనే సిద్ధాంతాన్ని వదిలేసి సంపాదించడం కోసమే జీవించు అనే మాయలో చిక్కుకు పోతున్నాం...
వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకుంటూ వచ్చిన ఈ సమాజంలో ఎవరి బ్రతుకైనా బంధాలుతోనే అల్లుకుని వుంటుంది, ఎన్నో బాధ్యతలతో నిండి వుంటుంది... ఆ బంధాలను, భాధ్యతలను కాదనుకుంటే ఆ బ్రతుకుకు అర్ధమే లేకుండా పోతుంది...
మనమంతా ఆశ అనే ఒక ఆయస్కాంతపు వలలో చిక్కుకుని బతుకుతూ పోతున్నాం... ఆ ఆశ అత్యాశగా, ఆ అత్యాశ దురాశగా రూపు దాలుస్తూ అది ధర్మాధర్మాల విభజన రేఖను చెరిపేసి కుయుక్తులు, కుతంత్రాలు, వెన్నుపోట్లు వేపుగా మనలను నడిపిస్తోంది... ధనం మరోవైపు సంబంధ బాంధవ్యాల మధ్య దళారిగా మారి మనలను కుటుంబ ధర్మానికి దూరంగా పట్టుకు పోతోంది...
రేయింబవళ్ళు అమ్మా నాన్న చేసిన సేవల్ని, కష్ట సుఖాలలో రక్షణ కవచంలా నిలబడ్డ బంధు జనాల ప్రేమాభిమానాలను ఏవేవో కొలమానాలతో తూకం వెయ్యాలనే పయత్నం చేస్తున్నాం... బంధాల మధ్య దూరాలకు దారులు వేస్తూ కుటుంబ ధర్మాన్ని అతిక్రమిస్తున్నాం...
కుటుంబంలో రకరకాల వ్యక్తిత్వాల వాళ్ళుంటారు... ప్రతి మనిషికీ ప్రత్యేకమైన జీవన శైలి, ఆలోచనా విధానాలు వుండే కుటుంబంలో అందరూ మనకు నచ్చినట్టుగా వుండాలని మనం ఆశ పడకూడదు...బ్రతుకులో ఎదురు దెబ్బలను మాత్రమే కాదు, నెత్తురు మరకలు కనిపించని వెన్నుపోట్లును కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది...
సంబంద బాంధవ్యాలపట్ల ఉత్కృష్ట జీవన విలువల్ని పాటించిన వాళ్లనే సభ్యసమాజం మనుషులుగా గుర్తిస్తుంది...
మనం ఎలా జీవించాలో బోధిస్తూ రామాయణ మహాగ్రంధం మానకొక బాట వేసి ఇచ్చింది... పూర్వీకులు వేసి యిచ్చిన ఆ సద్భావనల బాటలో వారు నేర్పిన సంస్కారాలను పాటిస్తూ బ్రతుకులో ముందుకు సాగిపోదాము...
******************
సర్వే జనా సుఖినోభవంతు
******************
సంస్కృతి
సనాతన సమాజం విలువలు, సంప్రదాయాలు, పురాణాలు.
విలువలు
సాంప్రదాయాలు
info@సనాతనసమాజం.com
+91-9840828274
© 2025. All rights reserved.