ఒకే తండ్రి పిల్లలకు తలా ఒక దారి చూపిస్తాయి వాళ్ళ తలరాతలు...

POSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

2/4/20261 min read

ఒకే తండ్రి పిల్లలకు తలా ఒక దారి చూపిస్తాయి వాళ్ళ తలరాతలు...

ఒకే తండ్రి పిల్లలకు తలా ఒక దారి చూపిస్తాయి వాళ్ళ తలరాతలు... ఒకే లగ్నంలో జన్మనెత్తిన లక్షల మందిలో ఏ ఒకరిద్దరికో వైభవాన్ని అందిస్తాయి...

ఇరువురూ కశ్యపు ప్రజాపతి సంతానమే అయినా దేవతలను, రాక్షసులను వేరే వేరే దారుల్లో నడిపించాయి వాళ్ళ తలరాతలు...

మాయ పాచికల చేతిలో మహా వీరులైన పాండవులను సైతం మట్టి కరిపించాయి... కిరీట ధారణ ముహూర్తానికే రామ చంద్రుడిని అడవి బాట పట్టించాయి... వైభోగాలలో మునిగి తేలాల్సిన యువరాజు సిద్దార్దుడిని సన్యాసిగా మార్చి అతడి చేతికి భిక్షా పాత్ర నందించాయి...

జీవితం అనే ఆటలో అదృష్ట దురదృష్టాలు, గెలుపు ఓటములు అనేవి మనిషి చేతిలో వుండవు...అందని దాన్ని గురించి ఆరాట పడనివాడు, దక్కనిదాన్ని గురించి విచారించనివాడు వివేకవంతుడు అన్నాడు విధురుడు...

మెట్టు మెట్టుకు అనిశ్చితి, ఆందోళనలతో సాగే జీవితం అనే ఈ వైకుంఠపాళి ఆటలో ఆరగించే పాములూ ఉంటాయి., అందలమెక్కించే నిచ్చెనలూ వుంటాయి., ఇందులో మనకు ఏది ప్రాప్తం అనేది మన చేతుల్లో వుండదు...కర్మను ఆచరించడానికే అధికారముంది గాని ఫలాన్ని ఆశిస్తూ ఆరాటపడే అధికారం జీవికి లేదన్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు...

బ్రతుకు విలువ తెలియనివాడు తలరాతలను తిట్టుకుంటూ కాలాన్ని గడుపుతూ వుంటాడు, బ్రతుకును ఆస్వాదించడం తెలిసినవాడు ఆ బ్రతుకులోని ప్రతి క్షణంలోనూ జీవిస్తూ కాలంతో పాటుగా కలిసి నడుస్తూ వుంటాడు...

కష్టము, దుఃఖము లేని జీవితం ఆ పరమాత్ముడు ప్రకృతిలో ఏ జీవికీ ఇవ్వలేదు...తన కర్మల ఫలితంగా సుఖ దుఃఖాలను పొందుతున్న మనిషి లభించిన సుఖాన్ని తన ఘనతగా చెప్పుకుంటూ దుఃఖానికి మాత్రం ఆ దేవుడు రాసిన తలరాతలే కారణమంటూ తిట్టుకుంటూ వుంటాడు...

భగవంతుడిని నమ్మి నడవమని పెద్దలు వేసిచ్చిన పూలబాట ఒకటి మనకు వున్నంతకాలం ఎదురయ్యే ఎటువంటి ప్రతికూలతలకైనా మనం చలించి పోవాల్సిన పని లేదు...పరస్పర విరుద్ధమైన మంచి చెడుల ప్రభావానికి ప్రతి జీవితమూ గురి అవుతూనే వుంటుంది., ఎదో ఒక ప్రతికూలత మనిషిని ఎప్పుడూ వేదిస్తూనే వుంటుంది...

పరస్పర సహకార జీవన యాత్రలో ఎవరూ ఒంటరివాళ్ళు కారు., ఎదురొచ్చే కష్ట నష్టాలకు లొంగకుండా బ్రతుకు పోరాటంలో కడదాకా ప్రయత్నిస్తూ పోయేవాడిముందు విధి రాసిన తల రాతలు కూడా తల వంచుతాయి... ఆ విధి రాసిన తలరాతలపై సైతం మార్కండేయుడు నాడు విజయం సాధించి చూపించాడు...

మనసు అనే నందనవనంలో సానుకూల భావాలు అనే సంపెంగలు సదా గుభాళించేలా చూసుకుందాం... మనం చిందించే చెమట బిందువులతోనే వక్ర గతులలో సాగుతూ పోయే మన తల రాతల్ని మనమే తిరిగి రాసుకుందాం...

********

సర్వే జనా సుఖినోభవంతు...

********