తప్పు కూడా అప్పుడప్పుడు ఒప్పే...

POSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUALTELUGU MOTIVATIONAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

2/2/20261 min read

తప్పు కూడా అప్పుడప్పుడు ఒప్పే...

అన్యాయాన్ని శిక్షించడానికి మించిన న్యాయం ఈ పుణ్యభూమిలో మరొకటి లేదు... దుష్టశిక్షణ, శిష్ట రక్షణవిషయంలో ధర్మం కొంచెం దారి తప్పినా ఈ కర్మభూమిలో అది తప్పు కాదు…

కుటుంబ ధర్మాన్ని అతిక్రమించి విభీషనుడు అమృత భాండాన్ని కొట్టి అన్నను చంపొచ్చు అని ఇంటి గుట్టు బయటబెట్టినా ఈ లోకం అతడిని తప్పు పట్టలేదు...చెట్టు చాటున దాక్కుని వాలిని మట్టు బెట్టేటప్పడు ఆ అధర్మ కార్యం ద్వారా అపకీర్తిని మోయాల్సి వస్తుందేమోనన్న భయాన్ని రాముడు కూడా లక్ష్యపెట్ట లేదు…

విష్ణువంతటివాడు మాయజేసి భస్మాసురుడిని మట్టుబెట్టినా ఈ లోకం అది ధర్మవిరుద్ధం అని అతడిపై నింద వేయ లేదు ...దుర్మార్గాన్ని దునుమాడే సందర్భంలో, కంసుడు తనకు మేనమామ అనే భావనను కృష్ణుడు తన మస్థిష్కం లోనికి కాసింత కూడా రానివ్వలేదు...జలంధరుడిని సంహరించే సమయoలోకొడుకు అనే పాశానికి శివుడు కూడా ఏమాత్రం చోటివ్వలేదు…

మనం చేసే పనిలో పదిమంది హితమూ దాగివుంటే ఆ పోరాటం ధర్మ విరుద్ధమైనది అయినా పదుగురి ప్రశంసలను అందుకుంటుంది., అందుకు విరుద్ధంగా పదుగురి మధ్య తన కళ్ళ ముందరే ఒక స్త్రీపై దుష్కర్మ జరుగుతూ వుంటే భీష్ముడు అంతటి మహావీరుడు మౌనసాక్షిగా ఉండిపోవడం అది నేరపూరిత మౌనమనే కోవకు చెందుతుంది…

బలవంతుల మనసుల్లో ఏర్పడే కొన్ని కాంక్షలు వాళ్ళ పాలనలో బ్రతికే సమాన్యుల జీవితాల్లో అంతులేని ఆశాంతిని, అలజడిని రగిలిస్తూవుంటాయి...నేడు అరణ్యాలలో మృగాల నుండి లేని ముప్పు జనారణ్యాలలో మానవ మృగాలనుండి ఎదురవుతోంది...

మానసిక కాలుష్యం మానవజాతిని తనకు తానే ఒక సమస్యగా మార్చేసింది... మనిషి తనలోని అహంకారాన్ని వదిలించుకోవడానికి సంపాదించుకున్న జ్ఞానం కూడా తిరిగి ఆ మనిషికి అహంకారాన్నే కానుకగా ఇస్తోంది... పౌరానిక కాలం నుండి నేటి వరకూ కొనసాగుతూ వస్తున్న ఈ అకృత్యాలను ఆపగలిగే నాదుడి రాక కోసం ఎదురు చూపులతో ముందుకుసాగిపోదాం…

మనిషి ప్రతి దశలోనూ ఆస్వాధించడానికి జీవితం అనే ఈ పూర్ణ కుంభంలో నవరసాలు నింపే పంపాడు ఆ పైవాడు. అది ప్రతి దశలోనూ ఆస్వాదిస్తూ సాగిపోవడం మన వంతు…

కర్మను అనుసరించి సాగే మనిషి బ్రతుకులో ఎంత ప్రతిఘటించినా జరిగే అనర్ధాలు, అకృత్యాలు జరగకుండా ఆగవు...అందమైన ఈ సామాజిక సరోవరంలో కలువపవ్వులు మాత్రమే కాదు, కలుషిత కారకాలైన కలుపుమొక్కలు కూడా మొలుస్తూ వుంటాయి...

రావణుడిలా సర్వమూ తెలిసిన మూర్ఖులున్న మన సమాజంలో దుర్యోధనుడిలా ఏమీ తెలియని మూర్ఖులూ వున్నారు... మనిషికి ఆ మాధవుడిచ్చిన రెండు మార్గాలలో వెలుగులవైపు మల్లేవాళ్ళు కొందరుంటే వెలుగులనుండి దూరంగా వెల్లేవాళ్ళు కూడా కొందరుంటారు…

ధర్మము - అధర్మము ఈ రెండింటి మధ్య జరిగిన రెండు మహా ధర్మ యుద్దాలను మన రామాయణ మహా భారతాలు మనకు బోధించాయి... అవి మనకు అందించిన విలువలు దిశగా మనమూ పయనిద్దాం., కుటుంబ ధర్మం కంటే సామాజిక ధర్మం గొప్పది అనే ఉత్కృష్ట భావనతో జీవిద్దాం…

*********************

సర్వే జనా సుఖినోభవంతు...

*********************