నిత్యం లక్షల జీవుల్ని మృత్యువు రూపంలో తన వెంట పట్టుకు పోయే కాలం కంటే శక్తివంతమైనది సృష్టిలో మరేది లేదు... భూత, వర్తమాన, భవిష్యత్తులు అంటూ మూడు కాలాలుగా, కృత, త్రేతా, ద్వాపర, కలి అంటూ నాలుగు యుగాలుగా వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరం అంటూ ఆరు రుతువులతో అలరారే ఇంద్రజాలం లాంటి ఆ కాలదేవత ఈ లోకం లోనికి రాబోయేవాళ్ళు ఎలా వుంటారో,మనకు తెలియనివ్వదు., ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినవాళ్లు ఏమయ్యారో కూడా ఎరుకనివ్వదు...
భగవత్ స్వరూపులుగా పూజలు అందుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం తన కను సన్నలలోనే, తన ఆజ్ఞలకు లోబడే తమ కర్తవ్యాలను నిర్వర్తించాలి అంటుంది ఆ కాలదేవత...
రాముడైనా ఆమె దృష్టిలో ఎక్కువ కాదు., కృష్ణుడైనా ఆమెకు లెక్కకు రాడు...
రాముడి నిండు యవ్వనాన్ని సైతం అడవి కాచిన వెన్నెలలా నిరర్ధకం చేసేసింది., అతడికి అండగా వుండాలని వచ్చిన అతడి ఆలిని అసురుడెత్తుకుపోతే కారడవులలో కన్నీటి పర్యంతమైన ఆ రామచంద్రుడిపై కాసింత కూడా కనికరం చూపించలేదు ఆ కాలం...
కరుణ లేని ఆ కాలమే కృష్ణ భగవానుడిని సైతం కష్టాలకు గురి చేసింది.,అతడి ఫుట్టుకను మాత్రమే కాదు., మరణాన్ని కూడా హృదయ విధారకంగా మార్చేసింది... జగన్నాటక సూత్రదారి అని కీర్తించబడే ఆ కృష్ణున్ని చివరకు ఒక పిట్టలు కొట్టేవాడి చేతిలో చావమని ఆదేశించింది...
ఈ ముల్లోకాలలో కాలాన్ని మించిన శక్తి మరేది లేదు...బ్రతుకు ప్రయాణంలో ఆ దేవత మనకు వరప్రసాధంగా ఇచ్చిన కొద్దిపాటి కాలం ఎంతో అమూల్యమైనది... వివేకంతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుందాం...
కలిసిరాని కాలం అంటూ కొన్ని మజిలీలు కూడా మనిషి జీవితంలో తారసపడతాయి. కాలచక్ర భ్రమణంలో శిశిరమైనా, వసంతమైనా ఆ కాలదేవత ఆదేశాలకు అనుగుణంగా వచ్చి పోతూ వుంటాయి...వసంతం శాశ్వతం అనుక్కునే దురాశకు లోను కావద్దు., పట్టుకు పీడించే శిశిరం పోదేమో అనే నిరాశకు చోటివ్వ వద్దు...
విజయాలు అపజయాలు, లాభాలు నష్టాలు, ఎన్నో మెరుపులు, కొన్ని మరకలు, ఈ అపురూపమైన కలయికే మనిషి జీవితం...
జన్మనెత్తిన ప్రతి మనిషీ కర్మ చెయ్యాలి అనేది కాలం నిర్దేశించిన భాధ్యత... ఆ భాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోవడం మనిషి కర్తవ్యం...
కాలం కరిగిపోతే మరల అది తిరిగి రాదు., భవిష్యత్తుకు సంబందించిన ఆశలెన్నైనా వుండొచ్చు., కానీ భవిష్యత్ కాలం ముందుకు జరిగి రాదు., అతి విలువైన వర్తమానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిద్దాం...
ఆది అంతాలు లేని ఆ కాలం మనకెన్నో గాయాలను కూడా చేస్తూ పోతుంది. సమయం వచ్చినప్పుడు వాటిని పూరించే భాధ్యత కూడా ఆ కాలమే నిర్వర్తిస్తుంది...
కాలం చేసిన గాయాలను పూరించే భాద్యత ఆ కాలానికే వదిలేద్దాం., అమావాష్య వెనకాలే పున్నమి వస్తుంది అనే ఆశతోనే బ్రతుకును ముందుకు పోనిద్దాం... బ్రతుకులో మంచి అయినా, చెడు అయినా ప్రతి క్షణాన్ని ఆ కాలదేవత ప్రసాదంగానే స్వీకరిద్దాం... కాలం మనకు ప్రసాధించిన ప్రతి క్షణంలోనూ సంపూర్ణంగా జవిద్దాం...
బ్రహ్మాండమంతటా వ్యాపించివున్న ఆ దివ్య శక్తిని మాటలతో కొనియాడడం కన్నా జరిగేదంతా ఆ కాలదేవత లీలగా ఆస్వాదిద్దాం...
*****************
సర్వే జనా సుఖినో భవంతు...
*****************l